కలం, మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం(Pragathi Dharmaram) విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి నాణ్యమైన 12 గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సుతార్ పల్లి గ్రామానికి చెందిన రైతులు సబ్ స్టేషన్ ముందర రామాయంపేట – గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటలు పొట్ట దశకు చేరుకున్నాయని, ఈ సమయానికి తగినంత నీరు అందక పోతే పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ సమస్యల వల్ల మోటార్లు కాలిపోవడమే కాకుండా పంటలకు నీరందించలేకపోతున్నామని మండిపడ్డారు. అధికారులు స్పందించి వ్యవసాయానికి తక్షణమే నాణ్యమైన 12 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
రహదారిపై రైతులు బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించారు.

