కలం, వెబ్ డెస్క్: తెలంగాణకు ఎల్‌నినో (El Nino) ముప్పు పొంచి ఉందా..? రానున్న 10 నెలలపాటు రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందా? అంటే ఔననే చెప్పక తప్పదు. కరువు పరిస్థితులపై ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే ప్రమాదం ఉందని, దీంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భూగర్భ జలమట్టాలు రోజుకు దాదాపు మూడు అడుగుల మేర పడిపోతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందన్నారు. సాధారణ స్థాయితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు 50 శాతమే ఉన్నాయని తెలుస్తోంది. ఈ పరిస్థితి కొనసాగితే పంటలకు సాగునీరు అందించడం కష్టతరమవుతుంది.
మరోవైపు.. నీటి కొరత తీవ్రతరం అయితే రాష్ట్రంలో తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలు, పశువుల వినియోగానికి ప్రాధాన్యమిస్తూ జాగ్రత్తగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనూ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యత, వినియోగం, సరఫరాపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించినట్లు సమాచారం. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

