కలం, కరీంనగర్ : నగరంలో చేయూత పింఛన్లకు అర్హత కలిగిన పేదలందరికీ ప్రభుత్వం వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు (CPI Leader Paidipalli Raju) డిమాండ్ చేశారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి రాజకీయ జోక్యం, పక్షపాతం లేకుండా నిజమైన అర్హులను గుర్తించి న్యాయం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
కరీంనగర్ నగరంలో ఇప్పటికీ అనేకమంది పేదలు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని, వారిని గుర్తించి తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలని పేర్కొన్నారు. చిన్నచిన్న సాంకేతిక సమస్యలు, రేషన్ కార్డులకు సంబంధించిన నిబంధనల కారణంగా అర్హులైన నిరుపేదలకు పెన్షన్లు నిలిచిపోవడం సమంజసం కాదన్నారు. పెన్షన్ సొమ్ముపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, ఇతర అర్హులైన పేదల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.
అధికారులు అనర్హులుగా తిరస్కరించిన దరఖాస్తుల్లోనూ వాస్తవంగా అర్హులైన వారు ఉన్నారని, అలాంటి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో మరోసారి సమగ్రంగా పరిశీలించాలని కోరారు. నగరంలో ఇప్పటివరకు 3,812 మందిని పెన్షన్లకు అర్హులుగా గుర్తించగా, మరో 1,553 దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. వీరిలో 820 మంది అర్హులుగా తేలినప్పటికీ, వారికి ఇంకా పెన్షన్లు మంజూరు చేయకపోవడం, జాబితాలో పేర్లు ప్రకటించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పైడిపల్లి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

