కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై (AP Local Body Elections) నిష్పాక్షికత, భద్రత కల్పించాలని కోరుతూ వైసీపీ ఏపీ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసింది. రాష్ట్రంలో అధికార యంత్రాంగం, పోలీసుల జోక్యం లేకుండా పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే ఈ ఎన్నికల ప్రక్రియ సాగేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని పార్టీ నేతలు కోర్టును కోరారు. ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో అక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాలని తమ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా సాగేందుకు అన్ని స్థానాల్లో 24×7 వెబ్‌కాస్టింగ్, విస్తృత సీసీటీవీ సర్వేలెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని వైసీపీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. అంతేకాకుండా, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరికీ సరైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
మరోవైపు, స్థానిక సమరంలో నిలవాలనుకుంటున్న ఆశావహులను అడ్డుకునేందుకు స్థానిక యంత్రాంగం కమ్యూనిటీ (కుల) సర్టిఫికెట్లు, ఎన్వోసీ లు, నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర నిబంధనలు విధిస్తూ అడ్డంకులు సృష్టిస్తోందని వైసీపీ ఆరోపించింది. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు అత్యంత కీలకమైన ఈ సర్టిఫికెట్లను ఏలాంటి ఆలస్యం లేకుండా వెంటనే జారీ చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

