కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా తల్లాడ (Thallada) మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పత్తి ఏరేందుకు పొలానికి వెళ్లిన ఓ వివాహితను పాము కాటేయడంతో (Snakebite) ఆమె ప్రాణాలు కోల్పోయింది. తల్లాడ మండలంలోని తెలగవరం గ్రామానికి చెందిన తేల్లూరి వాణి (30) మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని పొలానికి పత్తి తీసేందుకు వెళ్లింది.
ఈ క్రమంలో ఆమెను ప్రమాదవశాత్తూ పాము కాటేసింది. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది.
మృతి చెందిన వాణికి భర్త వెంకన్న, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన ఆ పిల్లల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. పిల్లాపాపలతో సంతోషంగా సాగాల్సిన కుటుంబంలో ఈ దుర్ఘటన జరగడంతో తెలగవరం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

