లొట్టపీసు అన్నావ్ కదా కేటీఆర్.. మరి ఇదేంటి!: ఆది శ్రీనివాస్

కలం, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నాంపల్లి ఏసీబీ కోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేయడంపై తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో “ఇది లొట్టపీసు కేసు, ఏం పీక్కుంటారో పీక్కోండి” అని మీడియా ముందు ప్రగల్భాలు పలికి, ఏసీబీ విచారణ సమయంలో పబ్లిక్ షో చేసిన కేటీఆర్… ఇప్పుడు విచారణను ఎదుర్కొవడానికి భయపడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

నిజాయితీపరుడైతే మధ్యలోనే కేసు నుండి తప్పించుకోవాలని డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు చెల్లించిన రూ. 54.88 కోట్ల ప్రజాధనంపై ఎవరి అనుమతితో పంపారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన వ్యవహారాలు, స్టార్ హోటళ్ల భాగోతాలు బయటకు రావడంతోనే కేటీఆర్‌కు వణుకు మొదలైందని, అందుకే దొంగదారులు వెతుక్కుంటూ దాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తప్పు చేయని వ్యక్తి న్యాయస్థానాల్లో ధైర్యంగా నిలబడి తన నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప, విచారణ నుంచి పారిపోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని కేటీఆర్ కు ఆది శ్రీనివాస్ సూచించారు. కేటీఆర్ వైఖరిని తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉందని తెలిపారు. న్యాయ ప్రక్రియ ద్వారానే కేటీఆర్ అక్రమాలు, అసలు బండారం త్వరలోనే పూర్తిగా బయటపడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>