కలం, వెబ్ డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కూటమి ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికలను ప్రస్తావిస్తూ జనసేన పార్టీకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో జనసేన శ్రేణులే ముందుగా రోడ్డెక్కి పోరాడాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. 2023లో చంద్రబాబు అరెస్ట్ నుంచి విడుదల వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా నిరసనలు చేపట్టామని గుర్తుచేస్తూ టీడీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
పవన్ పోరాటాన్ని ఎవరూ కాదనకపోయినా, తమ పార్టీ కార్యకర్తలు భయపడ్డారనే అర్థం వచ్చే వ్యాఖ్యలు సరికావని అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే పొత్తులో ఉన్న పార్టీల మధ్య ఇలాంటి మాటలు విభేదాలకు కారణమవుతాయా? రాబోయే ఎన్నికల్లో కూటమి ఐక్యతపై ప్రభావం చూపుతాయా? అన్న చర్చ మొదలైంది. ఈ వివాదం ఏపీ స్థానిక ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

