కలం, నిజామాబాద్ బ్యూరో: గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) పనులను నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వచ్చే ఏడాది జూన్, జూలై మాసాలలో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాల కోసం పుష్కర క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, నిర్ణీత కాల వ్యవధిలో అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలని, నాణ్యతతో పనులు జరిగేలా క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలని అన్నారు.
గోదావరి, మంజీర, హరిద్ర నదుల కలయికతో త్రివేణి సంగమ ప్రాంతంగా భాసిల్లుతున్న రెంజల్ మండలం కందకుర్తి వద్ద గల పుష్కర ఘాట్‌తో పాటు, నవీపేట మండలం యంచ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి సందర్శించారు.
కందకుర్తి వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కర ఘాట్ నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే గోదావరిలో నీటి ప్రవాహం కారణంగా ఇరిగేషన్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనుల విషయంలో కొంత జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే పనులను వేగవంతంగా చేపట్టి, మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల ప్రగతిని వారానికి కనీసం రెండు పర్యాయాలు పర్యవేక్షణ చేయాలని ఆర్డీఓ, తహశీల్దార్లకు సూచించారు.
అప్రోచ్ రోడ్లు, కల్వర్తుల ఏర్పాటు వంటి పనులను ఏకకాలంలో సమాంతరంగా చేపట్టేలా చూడాలన్నారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు కొనసాగుతున్న దృష్ట్యా, పుష్కర ఘాట్ల వద్ద పోలీస్ పెట్రోలింగ్ తో పాటు గ్రామ పాలన అధికారులు, లష్కర్లు నిరంతరం సందర్శిస్తూ నిఘా ఉంచాలన్నారు. పనులను చేపట్టే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తేవాలన్నారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, తహశీల్దార్లు శ్రవణ్, వెంకట రమణ, దేవాదాయ, పంచాయతీరాజ్, నీటి పారుదల తదితర శాఖల అధికారులు ఉన్నారు.

