కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుపరంకుండ్రం కార్తీక దీపం కేసులో (Tirupparankundram Deepam Case) సుప్రీంకోర్టు (Supreme Court ) శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉచ్చిపిళ్లైయార్ మండపంలో వెలిగించిన జ్యోతితోనే శనివారం దీపత్తూన్లో కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆదేశించింది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకున్న తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం చేసింది. సంబంధిత అధికారులకు ధిక్కార నోటీసులు జారీ చేసింది.
కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం న్యాయవ్యవస్థ అధికారాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకోవడం రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమ ఆదేశాలను కోర్టు స్వయంగా సవరించే వరకు వాటిని అమలు చేయాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోర్టు ఉత్తర్వులు చర్చలకు ఆహ్వానం కాదని, వాటిని ఎవరూ తమకు అనుకూలంగా మార్చుకోలేరని వెల్లడించింది. రాజ్యాంగ అధికారంతోనే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుందని, వాటిని బలహీనపరిచేందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయత్నించినా సహించబోమని సుప్రీంకోర్ట ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తిరుప్పరంకుండ్రం కొండపై దీపం (Tirupparankundram Deepam) వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీపం వెలిగించేందుకు కోర్టు ఆదేశాలను అమలు చేయబోమని ట్రస్టీలు స్పష్టంగా వ్యవహరించారని, ఇతర అధికారుల సహకారంతో జరిగిన ఈ చర్య తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భక్తుల ఆందోళనను ప్రస్తావిస్తూ, వారి భావాలను వ్యక్తం చేయడంలో తప్పులేదని న్యాయస్థానం పేర్కొంది.
కాగా, తిరుప్పరకుండ్రం కొండపై శనివారం దీపథంలో దర్గాకు 50 మీటర్ల దూరంలో దీపం వెలిగించేందుకు అనుమతిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. దర్గాకు రక్షణ కల్పించేందుకు సీఆర్పీఎఫ్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

