కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బహుజన వీరుడు పండుగ సాయన్న పెద్దోళ్లను కొట్టి పేదలకు పంచితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదలను దోపిడీ చేసి పెద్దోళ్లకు పంచుతోందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో రాజ్యాధికార పార్టీ పాదయాత్రలో భాగంగా సోమవారం పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమై మాట్లాడారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా లేవు. చిన్నచిన్న ఉద్యోగాల కోసం యూనివర్సిటీ చదువులు అవసరం లేదు. ప్రొఫెసర్లు, జడ్జిలు అగ్రకులాల వారే ఉన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగడం లేదు. లెక్క. యువత జెన్ జీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజకీయాల వైపు దృష్టి సారించాలి. విశ్లేషణాత్మకమైన పరిశోధనలు చేస్తేనే యూనివర్సిటీలో చదువుకోవాలని, లేదంటే ఆపేయాలి’ అని పిలుపునిచ్చారు.
వారికి పది శాతం రిజర్వేషన్లు..?
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ పేరుతో అయిదు శాతం లేని అగ్రకులాల వారికి పది శాతం రిజర్వేషన్లు ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తూ వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. బీసీల్లో ఇతర కులవృత్తుల వారు 56 శాతం ఉన్నారని కులగణన ద్వారా తేలినా.. రిజర్వేషన్ అమలు చేయకుండా అన్యాయం చేస్తోందన్నారు.
కార్పొరేట్ కాలేజీలు రాజకీయ పార్టీలకు డబ్బులు ఇచ్చి విద్యాహక్కు చట్టం అమలు కాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. తమిళనాడులో బీసీ ప్రభుత్వం ఉన్నందున అక్కడ కార్పొరేట్ కాలేజీలు లేవని, విద్యాహక్కు చట్టం పక్కాగా అమలవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజు బకాయిలు, మెస్ ఛార్జీలు ఇవ్వకుండా, వెనుకబడిన వర్గాలకు కేటాయించిన బడ్జెట్ ఖర్చు చేయకుండా ఆధిపత్య అగ్రకులాల వారు రూ.3 లక్షల కోట్లు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు.
అధికారం దక్కకపోతే..
వెనుకబడిన వర్గాల కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకొచ్చిందని, కుల వృత్తులకు చెందిన కత్తెర గుర్తు ఎంపిక చేసుకున్నామని తీన్మార్ మల్లన్న అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందించే ప్రధాన ఎజెండాను అమలు చేస్తామన్నారు. ఎప్పుడో చనిపోయిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పండుగ సాయన్నను గుర్తు చేసుకుంటున్నా.. మనవారికి మనం ఓటు వేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి ఉన్నత వర్గాలు వెళుతున్నాయని, వెనుకబడిన వర్గాలు సైతం అధికారం చేపట్టకపోతే మన జాతులు అంతరించిపోతాయని అంబేద్కర్ చెప్పారని తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే తప్ప మన బతుకులు మారవని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన వర్గాల వాయిస్ ప్రధాన మీడియాలో ఎక్కడ రాదని, సోషల్ మీడియాను అస్త్రంగా వాడాలని పిలుపునిచ్చారు. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ జెన్ జీ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల వైపు అడుగులు వేయాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.

