కలం, కరీంనగర్ బ్యూరో: సమస్యల పరిష్కారం కోసం ఆశగా ఎదురుచూసే సామాన్యులకు భరోసానివ్వాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమం (Karimnagar Prajavani) వసతుల లేమితో అర్జీదారులకు తీవ్ర అవాంతరాలను మిగులుస్తోంది. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో సోమవారం తొలిసారిగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఒకవైపు దరఖాస్తుల స్వీకరణతో మరోవైపు మౌలిక వసతుల కొరతతో వార్తల్లో నిలిచింది.
వసతుల లేమితో దరఖాస్తుదారుల అవస్థలు
రాబోయే రోజుల్లో సమస్యలు తీరుతాయన్న ఆశతో జిల్లాలోని వివిధ దూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ప్రజావాణి హాలులో అర్జీదారులకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం. వచ్చి కూర్చోవడానికి తగినన్ని కుర్చీలు లేక, ఉన్న కుర్చీల్లో ఎక్కువ భాగం విరిగిపోయి ఉండటంతో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు గంటల తరబడి నిలబడే ఉండాల్సి వచ్చింది.
తాగేందుకు మంచినీరు, సరిపడా సీటింగ్ లేకపోవడంతో “సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ మరో కొత్త సమస్య వచ్చిపడింది” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాల లేమి తీవ్రంగా ఉన్నప్పటికీ, తమ సమస్య పరిష్కారం కావడమే ముఖ్యమని భావించిన ప్రజలు అధికారులకు మొత్తం 138 దరఖాస్తులు సమర్పించారు.
శాఖల వారీగా కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష
అర్జీల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శాఖల వారీగా ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై తీవ్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పోలీస్, పంచాయతీరాజ్, ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్, విద్యుత్ (ఎలక్ట్రిసిటీ), కార్పొరేషన్ (మున్సిపల్) శాఖల్లో అత్యధికంగా అర్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారు. ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, పెండింగ్ దరఖాస్తులను వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ శాఖల కార్యాలయాలకు అందిన దరఖాస్తుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సీఎం ప్రజావాణి అర్జీలకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, వాటిపై సమగ్ర నివేదికలతో పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా రాబడి అధికారి (డీఆర్ఓ) స్వామి, ఆర్డీఓ షర్మిలలతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
నూతన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ అధునాతనంగా ఉన్నప్పటికీ, ప్రజావాణికి వచ్చే బాధితుల కోసం సరైన సీటింగ్, విరిగిపోని కుర్చీలు, తాగునీటి సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టరేట్ పరిపాలనా యంత్రాంగం వెంటనే స్పందించి సమావేశ మందిరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

