కలం, కరీంనగర్: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయం (Mahashakti Temple)లో సోమవారం గాయత్రీదేవి (బ్రహ్మచారిణి) రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ నిర్వాహకులు చంద్రఘటంతో, గాజులతో అలంకరణతో అమ్మవారిని అలంకరించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. వేదమాతగా, జ్ఞానప్రదాయినిగా, సకల చైతన్యానికి మూలశక్తిగా గాయత్రీదేవిని భక్తులు ఆరాధిస్తారు. అమ్మవారి ఈ రూపం జ్ఞానం, వివేకం, పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సుకు ప్రతీకగా నిలుస్తుంది. దసరా నవరాత్రుల్లో గాయత్రీదేవి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించడంతోపాటు జ్ఞానానికి, ధర్మానికి ప్రాధాన్యమివ్వాలనే సందేశాన్ని గుర్తుచేస్తుంది.
జ్ఞానమార్గంలో నడిపించే జగన్మాత గాయత్రీదేవి ఆరాధన ద్వారా విద్య, వివేకం, ఏకాగ్రత, సత్ప్రవర్తన కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, మంచి ఆలోచనలతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం ఈ ఆరాధనలోని ప్రధాన సందేశంగా భావిస్తారు.
అమ్మవారి సేవలో బండి సంజయ్..
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం అమ్మవారి ఆలయంలో మహాలింగార్జన పూజలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. వేములవాడలో ప్రతిరోజు సాయం ప్రదోష సమయంలో నిర్వహించే విధంగా ఈ ఆలయంలో కూడా పిండితో లింగాకారం ప్రతిష్టించి అభిషేకం చేశారు. దీపాలు వెలిగించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేశ్ సహా పలువురు నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సైతం దాండియా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు.
వేలాది మంది భక్తులు అధ్యాత్మిక భావనతో ఆడుతూ పాడుతూ దాండియాలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే గడుపుతున్నారు. ఆద్యంతం దాండియా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

