కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) సీతారామచంద్రస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా 108 మంది రుత్వికుల చేత సామూహిక శ్రీమద్రామాయణ పారాయణాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం బాలకాండ పారాయణంతో ఈ ఘట్టం శ్రీకారం చుట్టుకుంది. నవరాత్రి ఉత్సవాల తొలిరోజైన నేడు, అమ్మవారు అష్టలక్ష్మి అలంకారాల్లో ప్రధానమైన మొదటి అలంకారమైన ఆదిలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
సర్వ సంపదలతోపాటు శాంతి, శ్రేయస్సులు, మోక్ష సాధనకు ఆదిలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎంతో ఆవశ్యకమని ఆలయ అర్చకులు అన్నారు. ఈ శరన్నవరాత్రి పర్వదినాల సందర్భంగా ఆలయంలో అష్టలక్ష్మి అలంకారాలతోపాటు శ్రీమద్రామాయణ పారాయణ విశేష కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

