కలం, వెబ్ డెస్క్ : వాట్సాప్‌లో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు. డబ్బులు కొట్టేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పన్నాగం (Cyber Fraud) పన్నారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయంటూ నకిలీ సందేశాలు పంపి, లావాదేవీలు తాము చేయలేమని నిర్దారించేందుకు ‘NO’ అని రిప్లై ఇవ్వాలని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం (Cyber Fraud) తన దృష్టికి వచ్చినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ అని చెప్పారు. మొదట గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కు డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ రావడంతో భయాందోళనకు గురయ్యేలా చేస్తారు. తరువాత ఈ లావాదేవీలు మీరు చేయకపోతే వెంటనే No అని రిప్లై ఇవ్వాలని రెండో మెసేజ్ వస్తుంది. కంగారులో ‘NO’ అని రిప్లై ఇవ్వడంతో వల్లే ఫోన్‌పై హ్యాకర్లకు నియంత్రణ లభించి, బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని సజ్జనార్ హెచ్చరించారు. ఇలా చేస్తే మీ ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేసే అవకాశముందన్నారు.
ఇలాంటి మెసేజ్ లు వచ్చినప్పుడు కంగారుపడి ఎలాంటి రిప్లై ఇవ్వకుండా ఆ నంబర్ ను బ్లాక్ చేసి చాట్ డిలీట్ చేయాలని సీపీ సూచించారు. ఖాతాలో డబ్బులు కట్ అయితే అధికారిక యాప్ లను వినియోగించి వివరాలు తెలుసుకోవాలన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచించారు.

