కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ముఖ్య నగరం తిరుపతిలో అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన పనులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోమవారం అమరావతి సచివాలయం నుంచి వర్చువల్‌గా పనులకు శంకుస్థాపన చేశారు. భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్‌ను ఆవిష్కరించారు. శ్రీవారి ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణం, టీటీడీ ఉద్యోగుల నివాస లేఅవుట్ అభివృద్ధి, 9 మాస్టర్ ప్లాన్ రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
అలిపిరి వద్ద రూ.1,332 కోట్లతో భక్తుల కోసం వసతి సముదాయాల నిర్మాణం చేపట్టారు. నాలుగు బ్లాకుల్లో 2,700 గదులు, రోజుకు 15 వేల మంది భక్తులకు వసతి కల్పించే విధంగా నిర్మాణం జరుగనుంది. రూ.160 కోట్లతో అన్నప్రసాద కేంద్రం, ఒకేసారి 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా రూపకల్పన చేశారు. రూ.486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపట్టారు. పిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్స్‌లలో ఒకేసారి 16 వేల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు కల్పించనున్నారు.
తిరుపతి అభివృద్ధి (Tirupati Development)లో భాగంగా శ్రీవారి భక్తుల పార్కింగ్ సౌకర్యార్థం.. రూ. 311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం నిర్మాణం చేయనున్నారు. రూ.90 కోట్లతో 30 బస్ బేలతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్, వైద్య సేవలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయనున్నారు. భక్తుల కోసం పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, డిజిటల్ సమాచార కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. టౌన్‌షిప్‌లో అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థ ఏర్పాటు జరుగనుంది.
టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం దిశగా నివాస లేఅవుట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 418 ఎకరాల్లో 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయించింది. టీటీడీ ఉద్యోగుల నివాస లేఅవుట్‌లో మౌలిక వసతులకు రూ.230 కోట్ల వ్యయం ఖర్చు చేయనుంది. ఉద్యోగుల లేఅవుట్‌లో అంతర్గత బీటీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే తిరుపతి నగరంలో రూ.242 కోట్లతో 9 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి 3 మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం జరుగనుంది.

