ఖమ్మం అభివృద్ధికి మహర్దశ.. రూ. 1.55 కోట్ల పనులు ప్రారంభం

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగర సమగ్ర అభివృద్ధికి మహర్దశ పట్టింది. నగరంలోని ప్రతీ డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా దశలవారీగా సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao)  స్పష్టం చేశారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 9, 12, 13, 14వ డివిజన్లలో రూ.1.55 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను శనివారం ఆయన అధికారికంగా ప్రారంభించారు.

మౌలిక వసతుల అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల (Thummala Nageswara Rao ) మాట్లాడుతూ.. నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులను విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించిన ఆయన, ఇంకా మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను కూడా రానున్న రోజుల్లో ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

​చేపట్టే ప్రతీ అభివృద్ధి పని ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం అందించేలా ఉండాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అలాగే పుట్టపాక నుంచి రాజన్నపేట వరకు రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించి, త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను సుడా చైర్మన్ పువ్వాడ దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకువచ్చి, ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

​ఖమ్మం నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని కొనియాడిన మంత్రి, హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాల ప్రజలంతా ఐకమత్యంతో, సోదరభావంతో కలిసిమెలిసి జీవించే వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రజలందరూ ప్రశాంతంగా, ఆనందంగా జీవించేలా నగరాన్ని తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాడ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, పలువురు ప్రజాప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Also Read : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. ఖమ్మంలో సన్నాహక భేటీ!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>