కలం, నిర్మల్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన ర్యాలీ (INDIA Bloc Protest) నిర్వహించారు. స్థానిక మినీ ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.
అనంతరం కార్యాలయం ఎదుట రహదారిపై బైఠాయించి కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నిరసనలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు, ఇండియా కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఈ వ్యవహారంలో జ్ఞానేశ్ కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల వ్యవస్థను పరిరక్షించేందుకు ప్రతిపక్షాలు పోరాటం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, సీఈసీ రాజీనామా చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : సీఎం రేవంత్ పై ఆరోపణలు.. మెడికవర్ హాస్పిటల్ సంచలన ప్రకటన!
Follow Us On : WhatsApp

