కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా ఏర్పడి దశాబ్ది కాలం పూర్తయిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి (BRS) ఆధ్వర్యంలో శనివారం సంబరాలు (Nirmal District Decade Celebrations) నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జిల్లాకు చెందిన కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
ఇందులో భాగంగా 2016 అక్టోబర్ 11న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ జిల్లాను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మల్ జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. జిల్లాలో సమస్యలు పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజాప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మాజీ జడ్పి చైర్మన్ లోలం శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.
Also Read : నిరసన ఆగదు: తుషార్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

