ఎవరి కంట పడకుండా.. వరంగల్‌లో సీక్రెట్‌గా కోట్ల దందా!

కలం, వరంగల్‌ బ్యూరో: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పేకాట దందా (Warangal Gambling Den) గుట్టుగా సాగుతోంది. హనుమకొండ కేంద్రంగా గత ఆరు నెలలుగా ‘అందర్, బాహర్‌’ పేరుతో కోస్ పేకాట ఆడుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. రోజుకో ప్రాంతంలో అడ్డా మారుస్తూ, ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్టు, దీని వెనుక హనుమకొండ కు చెందిన ఓ మాజీ కార్పొరేటర్‌ సోదరుడు కీలకంగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనకు మరో 11 మంది భాగస్వాముల అండ ఉందని, వారిలో వరంగల్కు చెందిన అధికార పార్టీ నేత కూడా ఉన్నట్లు స్థానికంగా చర్చలో ఉంది.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చి..

కరీంనగర్‌, గోదావరిఖని, రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, భూపాలపల్లి, కాటారం, సిరివంచ, నర్సంపేట తదితర ప్రాంతాలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పేకాట రాయుళ్లు, రాజకీయ ప్రముఖులు హనుమకొండకు రైళ్లలో వచ్చి ఆట ఆడుతున్నారు. కోస్ ఆట పేరిట పందేలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని, రూ. కోట్లలో నిత్యం లావాదేవీలు సాగుతున్నాయి. అయితే కోస్ ఆట కోసం రోజుకో అడ్డా మారుస్తూ నిర్వహిస్తున్నారు. ఒకరోజు ఎల్కతుర్తి, సిద్దిపేట రోడ్ లో నిర్వహిస్తే, మరొక రోజు వరంగల్, ఇంకో రోజు స్టేషన్ ఘన్పూర్ రోడ్, వర్ధన్నపేట రోడ్, సుబేదారిలోని నిర్వాహకుడి అడ్డాలో ఇలా మార్చుతున్నారు. ఆరు నెలలుగా ఆట కొనసాగుతుండగా పోలీసులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఆటగాళ్లకు ప్రత్యేక సదుపాయాలు

రైళ్లలో వచ్చే ఆటగాళ్లకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో దిగగానే కార్లలో వచ్చి తీసుకెళ్తున్నారు. కారు ఎక్కగానే సెల్‌ఫోన్లను తీసుకుని స్విచ్‌ ఆఫ్‌ చేయించి, కొంతసేపు మాట్లాడించిన అనంతరం ఆట ఆడే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఆట ముగిసిన తర్వాత తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఇదంతా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చర్చ జోరుగా నడుస్తోంది.

పార్ట్ నర్స్ మధ్య గొడవ

పేకాట నిర్వహణలో భాగస్వాముల మధ్య గొడవ తలెత్తినట్లు మరో ఆరోపణ వినిపిస్తోంది. ప్రధాన సూత్రధారి ఇంట్లో జరగ్గా.. కాంగ్రెస్కు చెందిన వ్యక్తి ఓ భాగస్వామిపై దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో బుజ్జగింపులకు దిగారు. అనంతరం ఆయనకు పార్టనర్ షిప్ లేకుండా కొంతకాలం పాటు రోజుకు కొద్దిమొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం కుదిరింది. దీంతో ఆ నేత కేసు పెట్టే ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.

పోలీసులపైనా ఆరోపణలు

పేకాట దందాకు పరోక్షంగా సహకరించే కొందరు పోలీసులకు ప్రతి 15 రోజులకు ఒకసారి భారీగా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. సదరు పోలీసులు చిన్నస్థాయి పేకాట నిర్వాహకులపై చర్యలు తీసుకుంటూ, పెద్ద స్థాయిలో జరిగే ఆటను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితి తెలియకుండా ఉండేందుకు అప్పుడప్పుడు నామా మాత్రంగా కేసులు పెడుతున్నారనే ప్రచారమూ ఉంది. వరంగల్‌ కమిషనరేట్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఆధారాల మేరకు చర్యలు తీసుకుంటారా? లేక ఆరోపణలు ప్రచారానికే పరిమితమవుతాయా? అనేది ప్రశ్నగా మిగిలింది.

పారిపోయేందుకు యత్నించగా.. ఇద్దరికి విరిగిన కాళ్లు

కొద్దిరోజుల కింది హనుమకొండ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఓ చిన్నపాటి ఫంక్షన్‌ హాల్‌లో పేకాట ఆడుతుండగా పోలీసులు వస్తున్నారనే సమాచారం అందింది. దీంతో ఆటగాళ్లు హడావుడిగా బయటకు వెళ్లే క్రమంలో గోడ దూకి పారిపోయేందుకు యత్నించగా ఇద్దరికి కాళ్లు విరిగినట్లు సమాచారం. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>