కలం, తెలంగాణ బ్యూరో: ‘మెడికవర్’ హాస్పిటల్‌తో ( Medicover Hospital ) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని, ఆర్థిక లావాదేవీలు కూడా లేవని ఆ ఆస్పత్రి ఇండియన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేశ్ డెంగ్లూకర్ క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ బ్రాంచ్‌కు సంబంధించి సీఎం కుటుంబ సభ్యుల ఆర్థిక భాగస్వామ్యం ఉన్నదంటూ ఆరోపణలు వస్తున్నాయని, ఇవన్నీ చిల్లర రాజకీయాల్లో భాగమేనని స్పష్టం చేశారు.
ఈ మేరకు రాజకీయ పార్టీలతో తమ ఆస్పత్రి గ్రూప్‌కు ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని తెలిపారు. సికింద్రాబాద్ యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినట్లుగానే.. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఒక బ్రాంచ్‌ను ఓపెన్ చేశారని పేర్కొన్నారు. బేగంపేట్ యూనిట్‌ను హరీశ్‌రావు ప్రారంభించారన్నారు. దానికి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కూడా హాజరయ్యారని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాజకీయాల కోసమే బురద చల్లుతున్నారు
మెడికవర్ ఆస్పత్రులపై జరుగుతున్న ప్రచారాన్ని మహేశ్ ఖండించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వీడన్‌కు చెందిన యూరోపియన్ కంపెనీ కేవలం ఇండియాలోనే కాక 19 దేశాల్లో మెడికవర్ ఆస్పత్రుల్ని నెలకొల్పిందని తెలిపారు. లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇటీవల రూ.13 వేల కోట్లతో కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయని స్పష్టం చేశారు. నిజంగా రాజకీయాలతో సంబంధమే ఉన్నట్లయితే ఇలాంటి అగ్రిమెంట్ కుదిరేదే కాదని అన్నారు.
నిజానికి సికింద్రాబాద్ మెడికవర్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సీఎంతో పాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి హాజరైనందుకు రాజకీయ అనుబంధం ఉందని చిత్రీకరించడం సరికాదని కోరారు. మహరాష్ట్రలోని ఆస్పత్రులను శరద్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్నాథ్ షిండే తదితరులు ప్రారంభించారని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు వారివారి హోదాల్లో ఆస్పత్రులను ప్రారంభిస్తుంటారని… దానికి రాజకీయ రంగు పులమడం సరికాదని చెప్పుకొచ్చారు.

