కలం, నిజామాబాద్ బ్యూరో: మానసిక దివ్యాంగులకు స్నేహ సొసైటీ అండగా నిలబడటం గొప్ప విషయమని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని (Judge Neelima Muddasani) అన్నారు. నగరంలోని మారుతినగర్‌లో ఉన్న స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్‌ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై జడ్జి నీలమ ముద్దసాని హాజరై ప్రసంగించారు. మానసిక దివ్యాంగులను పెంచడం చెప్పినంత సులభం కాదని.. అదే సమయంలో తలుచుకుంటే పెద్ద కష్టం కూడా కాదన్నారు.
దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలతో పోరాడుతున్నామని అనుకోవద్దని.. వారి కోసం స్నేహ సొసైటీ లాంటి సంస్థలు అండగా ఉంటాయని జడ్జి నీలమ ముద్దసాని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి దేవుడు ఎవరినో ఒక రూపంలో మన వద్దకు పంపిస్తాడని.. సొసైటీ నిర్వాహకులు సిద్దయ్య, జ్యోతిని కూడా అలాగే పంపించాడేమో అని ప్రశంసించారు. మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో అవగాహన లేని రోజుల్లోనే మానసిక వికలాంగుల పాఠశాల ఏర్పాటు చేయడానికి వారు పడిన శ్రమ అర్థమవుతోందన్నారు.
చిన్న వయసులోనే చేర్పిస్తే..
గౌరవ అతిథి డాక్టర్ విశాల్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ దివ్యాంగ బాలలను చిన్న వయసులోనే ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించడం, సరైన శిక్షణ అందిస్తే వైకల్యం పెరగకుండా కాపాడుకోవచ్చని సూచించారు. గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య ఉపసంచాలకులు పురుషోత్తమ నాయక్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ, స్నేహ సొసైటీ కార్యదర్శి, అంధుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, టాటా ఇన్సూరెన్స్ మేనేజర్ సాయిరాం, రాజశ్రీ, బాలాజీ, సత్యనారాయణమూర్తి, సుమన్ పాల్గొన్నారు..

