కలం, ఆదిలాబాద్ : మీడియా ప్రతినిధులు వార్తలను ప్రచురించే ముందు వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిజ నిర్ధారణ చేసిన తర్వాతే ప్రజలకు అందించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) సూచించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని స్థానిక టీటీడీసీ హాల్‌లో(Adilabad TTDC) నిర్వహించిన రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్తల సేకరణ, ప్రచురణలో విశ్వసనీయతకు ప్రాధాన్యమివ్వాలని ఎస్పీ సూచించారు. ధ్రువీకరించని సమాచారాన్ని ప్రసారం చేయడం లేదా ప్రచురించడం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఏఐ ద్వారా సృష్టించిన లేదా మార్పులు చేసిన ఫొటోలు, వీడియోలు, సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండా నిజమని నమ్మరాదన్నారు. వార్తల విశ్వసనీయతను కాపాడుతూ బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, ఈ విషయంలో జర్నలిస్టులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.అనంతరం రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మీడియా ప్రతినిధులకు ఎస్పీ అఖిల్ మహాజన్ సర్టిఫికెట్లను అందజేశారు.

