కలం, పెద్దపల్లి: అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్పష్టం చేశారు. సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లిలోని డాక్టర్ విజయ ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులతో ఆయన ప్రత్యేక ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు జర్నలిస్టులు తమ చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలు, ఇండ్ల మంజూరు అంశంపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసి తమ సమస్యలను వివరించగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సమాజానికి,ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా,వేగవంతంగా సాగేందుకు యూనియన్లు, సంఘాలతో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారమే ధ్యేయంగా జర్నలిస్టులంతా కలిసి ఒక ఐదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆ కమిటీ ముందుకు వస్తే అధికారులతో మాట్లాడి అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. సుల్తానాబాద్,ఓదెల మండలాలతో పోలిస్తే పెద్దపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో స్థల లభ్యత కొంత క్లిష్టంగా ఉన్నప్పటికీ,అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల జాడను గుర్తించేందుకు అధికారులు నిరంతరం అన్వేషిస్తున్నారని వివరించారు.నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా అనువైన ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే, సంబంధిత సర్వే నంబర్లను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని జర్నలిస్టులకు సూచిస్తూ,అధికారులతో కలిసి సమష్టిగా పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆయన పూర్తి భరోసా ఇచ్చారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, నియోజకవర్గంలోని వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు.

