కలం, స్పోర్ట్స్: టీమిండియాను (Team India) గాయాల సమస్య వెంటాడుతోంది. వరుసగా ఆటగాళ్లు గాయపడుతుండటంతో జట్టు కూర్పుపై ప్రభావం పడుతోంది. తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) వార్షిక నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు భారత పురుషుల జట్టుకు చెందిన 32 మంది కీలక ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకునేందుకు రిహాబిలిటేషన్ తీసుకున్నారు. వీరిలో 20 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు కాగా, మరో 12 మంది ఇండియా-ఏ, టార్గెటెడ్ విభాగాలకు చెందినవారు.
ఐపీఎల్ 2026 తర్వాత గాయాల సమస్య మరింత పెరిగింది. దాదాపు ప్రతి సిరీస్‌లో కనీసం ఇద్దరు ఆటగాళ్లు గాయపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. పురుషులు, మహిళలు కలిపి మొత్తం 68 మంది క్రికెటర్ల గాయాలకు సీఓఈ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ (SSM) బృందం చికిత్స అందించింది. వీరిలో ఎక్కువ మందికి కండరాలు, మృదుకణజాలానికి సంబంధించిన గాయాలే అయ్యాయి. మరోవైపు, సీఓఈ కోసం బీసీసీఐ బడ్జెట్‌ను పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.92 కోట్ల ఖర్చు కాగా, 2026-27కు అంచనా వ్యయాన్ని రూ.127 కోట్లకు చేర్చింది. అంటే దాదాపు రూ.35 కోట్లు పెంచింది.
ఈ నివేదికలో రోహిత్ శర్మ (Rohit Sharma) గాయానికి సంబంధించిన అంశం కూడా ఉంది. ఐపీఎల్ 2026 తర్వాత తొడ వెనుక భాగంలోని కండరానికి గాయం కావడంతో రోహిత్ సీఓఈలో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. అయితే, ఈ విషయం గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు. మాంచెస్టర్ టెస్టులో 2025 జూలైలో పాదానికి ఫ్రాక్చర్ కావడంతో రిషభ్ పంత్ కూడా చికిత్స పొందాడు.
జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ పదేపదే గాయాల బారిన పడిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, నితీశ్ రెడ్డి గత 18 నెలల్లో కనీసం నాలుగు నెలల చొప్పున CoEలో గడిపారు. సెప్టెంబర్ 30 నాటికి విరాట్ కోహ్లీ, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే పేర్లు కూడా జాబితాలో చేరాయి.
మెడికల్ టీమ్‌ల మధ్య సమన్వయంపై ప్రశ్నలు
CoEలో స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ విభాగం అధిపతి పదవి ఖాళీగా ఉంది. నితిన్ పటేల్ 2025 మార్చిలో రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పోస్టు భర్తీ కాలేదు. గత నెలలోనే బీసీసీఐ ఈ పదవికి ప్రకటన ఇచ్చింది. టీమిండియా (Team India) మెడికల్ బృందానికి, సీఓఈ మెడికల్ బృందానికి మధ్య సమాచార మార్పిడిలో లోపాలున్నట్లు నివేదికలోని వివరాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం క్రికెట్ విభాగం అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ ఈ రెండు బృందాల మధ్య ప్రధాన అనుసంధానకర్తగా ఉన్నారు. ఆటగాళ్ల పనిభారం నిర్వహణలో మార్పులు చేయాలని టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లే రూక్స్ 2025 జూన్‌లో సూచించినా, CoE తన విధానాల్లో మార్పులకు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం.
Also Read : క్రికెట్లో బిగ్ ఛేంజ్.. బాల్ రంగుపై ఐసీసీ కీలక నిబంధన!
Follow Us On: Instagram

