కలం, యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) తనదైన సరళమైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణ ప్రజలతో మమేకమవుతూ, వారిలో ఒకరిగా కలిసిపోయారు. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి (Datharpally) గ్రామ సమీపంలో బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులైన లప్ప నాయక్ తండా వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి బయలుదేరిన ఆయన.. మార్గమధ్యలో ఓ చిన్న టిఫిన్ హోటల్ కనిపించడంతో తన వాహనాన్ని ఆపారు.
హోటల్ వద్దకు వెళ్లి నిర్వాహకుడిని ఆప్యాయంగా పలకరించిన అయిలయ్య.. స్థానికులతో కొద్దిసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం హోటల్ పొయ్యి వద్దకు వెళ్లి స్వయంగా బాణలిలో మిర్చి బజ్జీలు వేయడం ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా బజ్జీలు వేయడాన్ని చూసిన స్థానికులు, హోటల్ నిర్వాహకులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆడంబరాలు లేకుండా సామాన్యుడిలా ప్రజల మధ్య కలిసిపోయి, వేడి వేడి మిర్చి బజ్జీలు వేస్తూ అందరినీ అలరించారు. ఆయన సరళమైన వ్యవహారశైలి అక్కడి వారిని ఆకట్టుకుంది. దీంతో “మా నాయకుడు మనలోని ఒకడు” అంటూ స్థానికులు, తండా వాసులు సంతోషం వ్యక్తం చేశారు. బీర్ల అయిలయ్య హోటల్‌లో మిర్చి బజ్జీలు వేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

