కలం యాదగిరిగుట్ట: ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై కాంగ్రెస్, INDIA కూటమి లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 8న ‘బ్లాక్ డే’ పాటిస్తోంది.
అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన (Congress Protest) కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే, నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ప్రతిపక్ష నేతలపై పోలీసుల చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల హక్కుల కోసం కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

