కలం, వెబ్ డెస్క్ : సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూరాల వద్ద నిరసనకు దిగిన 14 మంది రైతులపై కేసులు నమోదు చేయడంపై రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదనతో ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని వదిలిన రైతులపై అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా కేసులు పెట్టడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. నీళ్లడిగిన అన్నదాతలను కటకటాల్లోకి నెట్టే చర్యలను తక్షణమే ఉపసంహరించుకుని, వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు (Chandrababu) పాలనా కాలాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాడు కరెంట్ బిల్లులు చెల్లించలేదనే నెపంతో ఒక్క గట్టు మండలంలోనే దాదాపు 3,000 మంది రైతులపై కేసులు నమోదు చేశారని, ఆ ఫలితంగానే కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కొని నామరూపాలు లేకుండా పోయిందని విమర్శించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహా రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.
పాలమూరు ప్రాంత అభివృద్ధికి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మరణశాసనం రాస్తున్నాయని నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీలు తెలంగాణ నీటి హక్కులను పక్క రాష్ట్రాలకు, కేంద్రానికి తాకట్టు పెడుతూ రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ (DPR)ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. దీనికితోడు చంద్రబాబు సర్కారు ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు నిరంతరం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
Also Read : తెలంగాణపై చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
Follow Us On: Instagram

