కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకవైపు నేతల ఆధిపత్య ధోరణి, మరోవైపు అంతర్గత కలహాలతో బీఆర్ఎస్ పార్టీ సతమతమవుతోంది. ముఖ్యంగా అశ్వారావుపేట (Aswaraopeta BRS) నియోజకవర్గ పార్టీలో రోజురోజుకూ ముదురుతున్న వర్గపోరు క్లైమాక్స్ దశకు చేరింది. “ఉంటే ఉండండి.. పోతే పోండి” అంటూ సొంత పార్టీ సీనియర్ నేతలను దెబ్బతీసేలా కొందరు నాయకులు ప్రదర్శిస్తున్న అహంకార పూరిత వైఖరితో గులాబీ దళం క్రాష్ ల్యాండింగ్‌కు దగ్గరైందనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆకస్మిక రాజీనామా నిర్ణయం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా, నియోజకవర్గంలో ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరినట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.
ఉంటే ఉండు.. పోతే పో
మంగళవారం కొత్తగూడెంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎదురైన ఘోర అవమానమే తాటి వెంకటేశ్వర్లు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రధాన కారణమైంది. నాలుగు పదుల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, రెండుసార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ నేతకు సన్నాహక సమావేశ ఆహ్వాన పత్రికలో పేరు ముద్రించకపోవడమే కాకుండా, కనీసం వేదికపైకి కూడా ఆహ్వానించకపోవడం ఆయన ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ తీవ్ర నిర్లక్ష్యంపై ప్రశ్నించినందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ దురుసుగా ప్రవర్తిస్తూ “ఉంటే ఉండు.. పోతే పో” అని వ్యాఖ్యానించడం గులాబీ పార్టీలోని నాయకత్వ ధోరణికి అద్దం పడుతోంది. పర్సంటేజీల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుల వల్లే పార్టీ తీవ్రంగా భ్రష్టు పడుతోందని, అధినేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల పట్ల తనకు గౌరవం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆత్మగౌరవాన్ని చంపుకుని కొనసాగలేకే రాజీనామా చేస్తున్నానని తాటి వెంకటేశ్వర్లు బహిరంగంగానే వెళ్లగక్కారు. మరోవైపు అశ్వారావుపేటలో అధిష్టాన ఆదేశాలను సైతం స్థానిక నేతలు పట్టించుకోవడం లేదనే చర్చ నడుస్తుంది.
పెత్తనం ఎక్కువైందా?
రాష్ట్ర స్థాయి మినహా గ్రామీణ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారు. అయినప్పటికీ కొంత మంది జిల్లా స్థాయి నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ నచ్చిన వారికి పదవులు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడం స్థానిక కేడర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. “కమిటీలే లేనప్పుడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను ప్రకటించే అధికారం వాళ్ళకు ఎవరిచ్చారు? కేటీఆర్ మాట కంటే సదరు నాయకుల పెత్తనమే ఎక్కువైందా?” అని బీఆర్‌ఎస్ శ్రేణులు పార్టీ అధికారిక వాట్సప్ గ్రూపుల్లోనే నేరుగా నిలదీస్తుండటం పార్టీలో క్రమశిక్షణ ఎంతలా దిగజారిందో తెలియజేస్తోంది.
బీఆర్ఎస్ ఉనికికే ఎసరు
తాటి వెంకటేశ్వర్లు రాజీనామా నిర్ణయంతో అశ్వారావుపేట బిఆర్‌ఎస్‌లో తిరుగుబాటు బావుటా ఎగరనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుండటంతో పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున ఖాళీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. నేతల స్వార్థం, కార్పొరేట్ రాజకీయం, జిల్లా స్థాయి నేతల ఉదాసీనత వల్ల అశ్వారావుపేటలో గులాబీ దళం క్రాష్ ల్యాండింగ్ అవ్వడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉనికికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

