త్వరలోనే బీసీ ప్రొటెక్షన్ యాక్టు : బీసీ కమిషనర్

కలం, నిజామాబాద్ బ్యూరో : అభివృద్ధి పేరుతో అరాచకాలకు పాల్పడుతూ, అనాగరికంగా వ్యవహరించే గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలను ఎంతమాత్రం ఉపేక్షించకూడదని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (TG BC Commission Chairman Niranjan) చైర్మన్ జి.నిరంజన్ అధికారులకు స్పష్టం చేశారు. బీసీ ప్రొటెక్షన్ యాక్టు అమలు పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని, త్వరలోనే ఇది అమలులోకి రానుందని ప్రకటించారు. ఇంకా పలు గ్రామాలలో సామాజిక బహిష్కరణలు, జరిమానాల పేరుతో సామాన్య ప్రజానీకాన్ని వేధింపులకు గురి చేయడం శోచనీయమన్నారు.

ఈ జాడ్యాన్ని రూపుమాపేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం కమిషనర్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో సామాజిక బహిష్కరణ సంఘటనలపై బాధితులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ నేతృత్వంలో సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాల లక్ష్మిలతో కూడిన బృందం బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్ లో బాధితులతో భేటీ అయ్యింది.

ఆయా గ్రామాలకు చెందిన సుమారు 90 మంది బాధితులు కమిషన్ ప్రతినిధులను కలిసి తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ, లిఖితపూర్వకంగా అర్జీలు సమర్పించారు. అనంతరం కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ బహిష్కరణ ఉదంతాలు చోటుచేసుకున్న ప్రాంతాల అధికారులతో క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిస్థితుల గురించి, వీ.డీ.సీలపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తూ అరాచకాలకు పాల్పడే కమిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ జి.నిరంజన్ సూచించారు.

గ్రామాల అభివృద్ధి కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవడాన్ని తాము తప్పు పట్టడం లేదని, అయితే వీ.డీ.సీల ముసుగులో అమాయక ప్రజలను బహిష్కరణలు, జరిమానాలు విధించడాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని నిరంజన్ స్పష్టం చేశారు. వీ.డీ.సీలు చట్ట పరిధిలో పని చేసేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని, దీనికోసం అదనపు కలెక్టర్, పోలీసు, రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగానికి బీసీ కమిషన్ (TG BC Commission) చైర్మన్ ప్రతిపాదించారు. వీ.డీ.సీల అనైతిక చర్యలతో ఇబ్బందులకు గురి అయ్యే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. అవసరమైతే వారికి జిల్లా యంత్రాంగం ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు కళా బృందాల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన ఈ రుగ్మతను దూరం చేయకపోతే భవిష్యత్తులో ఈ జాడ్యం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. వీ.డీ.సీలు చట్టానికి లోబడి పని చేసేలా, పౌరుల హక్కులు పూర్తి స్థాయిలో పరిరక్షించబడేలా, గ్రామగ్రామాన ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని నిరంజన్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీ.ఆర్.ఓ గీత, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు ప్రకాశ్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ అధికారులు సునీత, ఇర్ఫాన్, సతీష్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సాయికుమార్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>