కలం, నిర్మల్ : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీకి 108 సిబ్బంది (108 Staff) అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మామడ మండలం తాండ్ర గ్రామానికి (Tandra Village) చెందిన బాదావత్ నవీనకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే ఈఎంటీ సురేష్, పైలెట్ విజయ్ అంబులెన్స్‌తో గ్రామానికి చేరుకుని ఆమెను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తున్నారు. మార్గమధ్యలో నవీనకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో పరిస్థితిని గుర్తించిన ఈఎంటీ సురేష్ అంబులెన్స్‌లోనే ప్రసవం చేయగా, ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువును ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

