కలం, వనపర్తి: ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లను తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో ఇండియా కూటమి, అఖిలపక్ష పార్టీల నాయకులు బుధవారం వనపర్తి (Wanaparthy)లో ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి సమీకృత కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి ‘బీజేపీ హటావో.. దేశ్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి (Shiva Sena Reddy) మాట్లాడుతూ.. బీజేపీకి ఓటు వేయని వారి పేర్లను ఫామ్–6 పేరుతో ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నియోజకవర్గంలో సుమారు 2.75 లక్షల ఓట్లు ఉండగా.. 45 వేల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని అన్నారు. బతికున్న అర్హులైన పౌరుల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్–326 వయోజన ఓటు హక్కుకు హామీ ఇస్తోందని, ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని శివసేనరెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓటు హక్కును కాపాడే వరకు ఉద్యమం ఆగదన్నారు.
అనంతరం సీఈసీ జ్ఞానేశ్వర్‌కుమార్, బీజేపీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్నికల వ్యవస్థలో మార్పులను అడ్డం పెట్టుకుని బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ప్రయత్నిస్తోందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం ఐక్యంగా పోరాడతామని ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జయరాములు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌బాషా, సీపీఎంఎల్ జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు తిరుపతయ్య, రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి రమేష్, పట్టణ అధ్యక్షుడు కదిరే రాములు, పలువురు కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

