కలం, నిజామాబాద్ బ్యూరో : మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారు సమీక్ష నిర్వహించారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకుని, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇటీవలి కాలంలో పల్లెల్లో గుడుంబా, నాటుసారా విక్రయాలు మళ్ళీ మొదలైనట్లు తెలుస్తోందని సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే ఇలాంటి మత్తు పదార్థాల నిరోధానికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తూ వారి భవిష్యత్తును అంధకారంగా మారుస్తున్న గంజాయి విక్రయాలపై గట్టి నిఘా ఉంచాలని ఆయన (Sudarshan Reddy) సూచించారు. ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని, ఎక్కడ కూడా మత్తు పదార్థాల జాడ కానరాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా కల్తీ కల్లు విక్రయాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు.
ఎక్కడైనా కల్తీ కల్లు కారణంగా అవాంఛనీయ ఘటనలు జరిగితే, అందుకు ఎక్సైజ్ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగిస్తున్న అల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరోఫాం ఎక్కడి నుండి వస్తుంది, సరఫరాదారులు ఎవరు అనే మూలాలను అన్వేషించి, సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఆయన అధికారులను హెచ్చిరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా రెవెన్యూ అధికారి గీత, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీధర్, ఎస్పీ నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

