కలం, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఒక రైలులో (Train Accident) అకస్మాత్తుగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వైపు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు చక్రాల వద్ద బ్రేక్ లైనర్లు గట్టిగా పట్టుకోవడంతో ఘర్షణ ఏర్పడి, దట్టమైన పొగలు, అలాగే మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే రైలు కదులుతున్న సమయంలో పొగలు రావడాన్ని గమనించిన అసిస్టెంట్ లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆయన విషయాన్ని లోకో పైలట్‌కు తెలియజేయడంతో, వెంటనే రైలును బీబీనగర్ స్టేషన్లో నిలిపివేశారు. లోకో పైలట్ చాకచక్యంగా రైలును ఆపడంతో భారీ ప్రమాదం తపినట్లయింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు.
ఈ విషయంపై సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది, రైల్వే టెక్నికల్ బృందం వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం బ్రేక్ లైనర్లలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసి, పరిస్థితి సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్నాకే రైలును ముందుకు పంపించారు. ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

