కలం, నిజామాబాద్ బ్యూరో: ఎల్‌నినో (El Nino) ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటడంతో నిజామాబాద్ జిల్లాలో పంటలు మాయిశ్చర్ స్ట్రెస్ ఎదుర్కొంటున్నాయి. నేలలు నెర్రెలు చాస్తుండగా.. బోర్లు వట్టిపోతూ పంటలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరో రెండు తడుల నీరు అందితే చేతికొచ్చే పంటలు సైతం నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 14 శాతం లోటు నమోదైంది. ఈ ఖరీఫ్‌లో 5.35 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు.
ఇందులో 4.30 లక్షల ఎకరాల్లో వరి, 35 నుంచి 40 వేల ఎకరాల్లో సోయా, 55 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 20 నుంచి 22 వేల ఎకరాల్లో పసుపు సాగైంది. మిగిలిన విస్తీర్ణంలో ఇతర పంటలు సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పంటలు మాయిశ్చర్ స్ట్రెస్ ఎదుర్కొంటున్నాయి. బాన్సువాడ, వర్ని డివిజన్లలో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, వర్ని, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని చాలా మండలాల్లో పంటలకు తేమ శాతం తక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. పొట్ట దశలో ఉన్న వరితోపాటు ఇతర పంటల దిగుబడిపైనా దీని ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
200 ఎకరాల్లో ఎండిపోయిన పంటలు
వర్ని మండలంలో అప్పుడప్పుడు కురిసిన వర్షాలు, బోరుబావుల నీటితో పంటలను కాపాడుకోవచ్చన్న ఆశతో రైతులు వరి, మొక్కజొన్న సాగు చేశారు. అయితే చివరి దశలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. పైడిమల్, సిద్దాపూర్, గుంటూరు క్యాంప్, కోకల్ప్దాస్ తండా, చేలక తండా, చింతల్‌పేట్ శివార్లలో సుమారు 200 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఇప్పటికే సుమారు 50 ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో కొందరు రైతులు వాటిని దున్నివేశారు. మరికొన్ని పంటలు పొట్ట, పాలు పోసుకునే దశలో ఉండగా వాటికి నీరు అందడంలేదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆరుతడి పంటలే వేయాలి: వ్యవసాయ అధికారి వీరాస్వామి
ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందే అంచనా వేసినప్పటికీ కాస్త వర్షాలు కురవడంతో జిల్లాలో ఖరీఫ్ పంటలు గట్టెక్కాయని జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి తెలిపారు. అక్కడక్కడా మాయిశ్చర్ స్ట్రెస్ ప్రభావం కనిపిస్తోందన్నారు. ఇబ్బంది ఉన్న చోట కొందరు రైతులు పక్క పొలాల రైతుల నుంచి నీరు తీసుకుని పంటలను కాపాడుకుంటున్నారని తెలిపారు.
రబీ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని, ఇంటి అవసరాల కోసం కొంతమేర వరి సాగు చేసుకోవచ్చని చెప్పారు. అయితే మొక్కజొన్న, శనగ, పెసర, ఆవాలు, పొద్దుతిరుగుడు, జొన్న వంటి తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. వరి సాగు చేస్తే.. అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

