కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఎక్స్‌ప్రెస్ హైవేపై చోటుచేసుకున్న తీవ్ర అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. నోయిడా నుంచి ఆగ్రా వైపు సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సులో నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 150 సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు (Bus Fire) చెలరేగాయి. బస్సు ఇంజిన్ భాగాన్ని పరిశీలించిన డ్రైవర్, దట్టమైన పొగ రావడాన్ని గమనించి వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆలస్యం చేయకుండా బస్సును రహదారి పక్కన నిలిపివేసి ప్రయాణికులందరినీ త్వరితగతిన కిందకు దించేశాడు. దీంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
ఇదిలాఉంటే ప్రయాణికులు కిందకు దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చి, మొత్తం బస్సును చుట్టుముట్టాయి. స్థానికులు, ఇతర వాహనదారులు అందించిన సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని ఫైర్ ఇంజిన్ల సాయంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా బూడిదైపోయింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

