కలం, నిర్మల్ : రష్యాలో చిక్కుకుపోయిన నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి (Medipalli Youth) గ్రామానికి చెందిన చౌటుపల్లి నరేష్‌ను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) చొరవ తీసుకున్నారు. ఉపాధి కోసం 2025 నవంబర్ 13న రష్యాకు వెళ్లిన నరేష్ 2026 ఏప్రిల్ 15 నుంచి వారికి అందుబాటులో లేకుండా పోయారు. రష్యన్ ఆర్మీలో చేరాల్సి వస్తోందని గతంలో కుటుంబ సభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వానికి అందిన సమాచారంలో పేర్కొన్నారు.
నరేష్ కుటుంబ సభ్యుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఆయన ఆచూకీ గుర్తించి సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం, సంబంధిత రష్యా అధికారులను కోరారు. నరేష్ కుటుంబానికి అండగా ఉంటామని, యువకుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.

