కలం, నేషనల్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ముఖ్యమంత్రి విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అధికారికంగా ఇండియా కూటమిలో చేరింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకే.. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ భాగస్వామ్యంతో, సీపీఐ, సీపీఐ(ఎం)ల బయటి మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నది.
ఈ నేపథ్యంలో విడిగా ఉంటూ రాజకీయ స్థలాన్ని కోల్పోవడం కంటే జాతీయ కూటమితో నడవడమే సరైన వ్యూహమని భావించిన విజయ్.. శనివారం చెన్నైలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశానికి తన పార్టీ ప్రతినిధులు ఆధవ్ అర్జున, మేరీ విల్సన్‌ను పంపారు. దీనిని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మాణికం ఠాగూర్ ‘చారిత్రాత్మక దినం’గా అభివర్ణించారు. కాగా, ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా ఈ నూతన కూటమి పోరాటానికి సిద్ధమైంది. అక్టోబర్ 13, 14 తేదీల్లో తమిళనాడు వ్యాప్తంగా జిల్లా స్థాయి నిరసనలు, అలాగే 15న చెన్నైలో భారీ బహిరంగ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
2029కు రోడ్ మ్యాప్..
ప్రస్తుతానికి కేవలం రాష్ట్ర పాలన, రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్న టీవీకే నాయకత్వం.. విజయ్‌ను జాతీయ స్థాయిలో ‘ప్రధాని అభ్యర్థి’గా ప్రొజెక్ట్ చేసే సామాజిక మాధ్యమ ప్రచారాలకు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు తాత్కాలికంగా బ్రేక్ వేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది. ఈ పరిణామం 2029 లోక్సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుకు స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ఇస్తుండగా.. ఇప్పటివరకు తమిళనాడులో ‘ఇండియా’ కూటమికి ప్రధాన ముఖచిత్రంగా ఉన్న డీఎంకే.. కొత్త రాజకీయ సమీకరణాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

