కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలోనే ధాన్యం ఉత్పత్తికి చిరునామాగా నిలిచే ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ కేటాయింపులు, రికవరీ(CMR Rice Recovery) ప్రక్రియ అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రైతుల వద్ద ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించి సేకరించిన వేల టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు అప్పగించగా, దాన్ని యథేచ్ఛగా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. గడిచిన 12 ఏళ్లుగా పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా కానీ..
ధాన్యానికి విపరీతమైన గిరాకీ ఉన్న సమయంలో ప్రభుత్వ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్న మిల్లర్లు, తిరిగి పౌరసరఫరాల సంస్థకు అందించడంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, నల్లగొండ ప్రాంతాల్లోని పలు రైస్ మిల్లుల నుంచి వివిధ సీజన్లకు సంబంధించి ఇప్పటికీ దాదాపు రూ.1,000 కోట్లకుపైగా విలువైన సీఎంఆర్ బియ్యం రాబట్టాల్సి ఉంది. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో 143 మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం నిల్వలు లేవని తేలింది. గతంలో 500 మిల్లులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా, వారి నుంచి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోవడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది.
ఆ శాఖల అధికారులపై చర్యలేవీ..?
మిల్లులకు ధాన్యం చేరిన క్షణం నుంచి పర్యవేక్షించాల్సిన సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ (సీఎస్‌డీటీ), జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ), తహసీల్దార్, కలెక్టర్లు ప్రతినెలా క్షేత్రస్థాయిలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పర్యవేక్షణ కేవలం కాగితాలకే పరిమితమైంది. ధాన్యం అక్రమంగా తరలిపోతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం పబ్లిక్ డిమాండ్స్ రికవరీ (పీడీఆర్) యాక్ట్ కింద మిల్లులను, మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడంలో అధికారులు తీవ్ర జాప్యం వహిస్తున్నారు.
మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటుండగా.. పౌరసరఫరాల శాఖ లీగల్ టీమ్‌లు సమర్థవంతమైన వాదనలు వినిపించడంలో విఫలమవుతున్నాయి. ఇది పన్ను చెల్లింపుదారుల సొమ్ము అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలో జరుగుతున్న నిర్లక్ష్యానికి తక్షణమే చెక్ పెట్టలేకపోతున్నారు. పౌరసరఫరాల శాఖ సాధారణ స్టాండింగ్ కౌన్సిల్‌తో కాకుండా నేరుగా అడ్వకేట్ జనరల్ (ఏజీ) రంగంలోకి దిగి, ఉన్నత న్యాయస్థానంలో ప్రాతినిధ్యం వహించి స్టేలను వెకేట్ చేయించాలనే డిమాండ్లు ఉన్నాయి.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా విచారణకు డిమాండ్
ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న మిల్లర్లపై బీఎన్ఎస్, నిత్యావసర వస్తువుల చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరి కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, నిర్ణీత గడువులోగా అపరాధ రుసుము, చక్రవడ్డీతో సహా రికవరీ పూర్తి చేయాలని కోరుతున్నాయి. అలాగే గడిచిన 12 ఏళ్లుగా ఇలాంటి అక్రమాలకు సహకరిస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహించిన పౌరసరఫరాల, రెవెన్యూ అధికారులపై అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ విచారణ జరిపి, వారి ఆదాయానికి మించిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

