కలం, వెబ్ డెస్క్: తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి (Tirumala Leopard) సంచారం మరోసారి కలకలం రేపింది. ఈ రోజు వేకువజామున మోకాళ్ళ మెట్టు మండపం సమీపంలో చిరుత తిరుగుతుండగా గమనించారు. అయితే ఆ సమయంలో మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.
ఈ విషయంపై సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను అడవి వైపు తోలివేసే చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో తరచూ క్రూరమృగాలు సంచరిస్తుండటంతో అటవీ శాఖ, టీటీడీ అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
కాగా, ఈ మార్గంలో భక్తులు ఒంటరిగా వెళ్లకుండా, విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో గుంపులు గుంపులుగా మాత్రమే కొండపైకి వెళ్లాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. చిన్నపిల్లలతో వెళ్లే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని, నడక మార్గంలో ఎక్కడా ఆగకుండా గుంపుతో పాటు ముందుకు సాగాలని సూచించారు.

