కలం, తెలంగాణ బ్యూరో: ‘సర్’ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇన్ని రోజులు ఓటర్ల జాబితా నుంచి పేర్లను డిలీట్ చేసిన వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్‌ను ప్రజలు, పార్టీలు తప్పుపట్టాయి. ఆ తర్వాత వివరాల్లో తేడాలున్నాయంటూ.. ఐఏఎస్ అధికారులు, సెలబ్రెటీలు మొదలు సామాన్యుల వరకు సీఈఓ ఆఫీస్ నుంచి నోటీసులు జారీ కావడం చర్చకు దారితీసింది. ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బోగస్ ఓటర్లు లేదా అర్హత లేనివారి పేర్లు జాబితాలో ఉన్నాయని పేర్కొంటూ, వాటిని తొలగించాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్‌కు ఫామ్-7(Form-7 Controversy) ద్వారా ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాల్సిన ఈ ఫామ్-7 అప్లికేషన్లు.. పక్కా ప్లాన్ ప్రకారం ఓటర్ల పేర్లు, వివరాలను ముద్రించి బీఎల్‌వోల (బూత్ లెవల్ ఆఫీసర్లు) చేతికి కట్టకట్టలుగా ఎలా వస్తున్నాయన్నది పార్టీలకు అంతుచిక్కడం లేదు.
ముషీరాబాద్‌లో మూడు రోజుల క్రితం దర్శనమిచ్చిన ఫామ్-7 వ్యవహారంపై సీఈఓకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బహదూర్‌పురా, గోషామహల్ నియోజకవర్గాల్లోనూ కట్టలకొద్దీ ప్రింటెడ్ ఫామ్-7 దరఖాస్తులు కనిపించాయి. నోటీసులు అందుకున్న ఓటర్లు ఫామ్-6 ద్వారా తిరిగి జాబితాలో చేరేందుకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తాయని ఆశిస్తున్న సమయంలో డిలీషన్ కోసం ఫామ్-7 అప్లికేషన్లు రావడం అటు మజ్లిస్, ఇటు కాంగ్రెస్ పార్టీల్లో పలు అనుమానాలకు తావిచ్చినట్లయింది. ప్రింటెడ్ ఫామ్‌ల విషయంలో సీఈఓ కార్యాలయం సమగ్రమైన దర్యాప్తు జరిపి, బాధ్యులను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని రెండు పార్టీలు డిమాండ్ చేశాయి.
బీజేపీ హస్తం: అసదుద్దీన్
ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సిన ఫామ్-7 దరఖాస్తులు ప్రింటెడ్ ఫార్మాట్‌లో బయట వ్యక్తుల చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. పక్కా ప్లాన్ ప్రకారం బీజేపీ దీన్ని నడిపిస్తున్నదని ఆరోపించారు. ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే ముస్లిం ఓటర్ల పేర్లను డిలీట్ చేయాల్సిందిగా ఈసీకి దరఖాస్తులు వస్తున్నాయని ఆరోపించారు. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఓటర్ల పేర్లను డిలీట్ చేస్తే జంతర్ మంతర్ ఉద్యమాన్ని మించిన ఆందోళన తప్పదని హెచ్చరించారు.
పేర్లను డిలీట్ చేస్తే ఉద్యమమే: కాంగ్రెస్
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజుల కిందట వెలుగు చూసిన ప్రింటెడ్ ఫామ్-7 అప్లికేషన్లపై కాంగ్రెస్ పలు అనుమానాలను వ్యక్తం చేసింది. వీటిని ఎక్కడ ముద్రిస్తున్నారు? ఎవరు ముద్రిస్తున్నారు? ఆ అవసరం ఎందుకొచ్చింది? వారికి అధికారం ఎవరిచ్చారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? అంటూ సందేహాలు వ్యక్తం చేసింది. ప్రణాళిక ప్రకారం ఈ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని సీఈఓకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి అప్లికేషన్లు ఇప్పటికే బీఎల్వోల చేతికి చేరినందున సరైన వెరిఫికేషన్ చేయకుండా పేర్లను తొలగిస్తే భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. నిర్ధారణ చేసుకోకుండా జాబితా నుంచి పేర్లను ఫామ్-7 ఫిర్యాదుల ఆధారంగా డిలీట్ చేస్తే చట్టపరంగా కొట్లాడతామని, న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదని హెచ్చరించారు.
ఏంటీ ఫామ్-7?
- కొత్తగా ఓటరుగా చేరాలనుకున్నవారు ఫామ్-6.. పేర్లలో తేడాలు, అడ్రస్‌లో మార్పుల కోసం ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకుంటారు.
- ఒక బోగస్ ఓటర్ లేదా చనిపోయినవారు లేదా డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించాలని ఫిర్యాదు చేసే సందర్భాల్లో ఫామ్-7 ఉపయోగిస్తారు. జాబితాలో పేర్కొన్న చిరునామాలో ఓటరు లేరనుకున్నప్పుడు కూడా ఫిర్యాదు చేస్తారు.
- ఒక్కసారిగా వేల సంఖ్యలో ప్రింటెడ్ ఫార్మాట్‌లో ఫామ్-7 దరఖాస్తులను కట్టలుకట్టలుగా బీఎల్‌వోలకు సమర్పించడమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది.
- బీఎల్‌వోలకు తగిన శిక్షణ ఇచ్చినందున నిబంధనల ప్రకారం అలాంటి ప్రింటెడ్ ఫామ్‌లను స్వీకరించకూడదు. కానీ కొందరు బీఎల్‌వోలు వాటిని తీసుకున్నట్లు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
- రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 29 వేలకు పైగా ఇలాంటి ఫామ్-7 కంప్లైంట్స్ అందినట్లు సీఈఓ ఆఫీస్ వర్గాల సమాచారం. ఇవి గ్రేటర్ హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం మరిన్ని సందేహాలకు తావిస్తున్నది.

