కలం, ఖమ్మం బ్యూరో: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను త్వరలోనే పరిష్కరించి, పేదలకు భూ పట్టాలు అందిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. రేగళ్ల గ్రామం, పాల్వంచ పట్టణం, కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో దొరలకు సంబంధించిన భూముల పట్టాలను అర్హులైన పేదలకు అందిస్తామన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) మండలం రేగళ్ల గ్రామంలో నిర్వహించిన సభలో మంత్రి పాల్గొన్నారు. త్వరలోనే మరోసారి రేగళ్ల గ్రామానికి వచ్చి పేదలకు భూ పట్టాలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వాల హయాంలో దొరల చేతుల్లో ఉండిపోయిన భూమి పట్టాల సమస్యపై అధికారులు ఇప్పటికే కార్యాచరణ వేగవంతం చేశారని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి భూమిపై హక్కు కల్పిస్తామని తెలిపారు. పోడు భూములు, అటవీ భూముల సమస్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశమైనా.. గిరిజనులు, గిరిజనేతరుల ప్రయోజనాలను కాపాడేలా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
దసరా నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో (Indiramma Housing Scheme) భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చామని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) వివరించారు. దసరా నాటికి 2.40 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. పేదోడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా హైదరాబాద్లో సుమారు రూ. 250 కోట్ల విలువైన స్థలాల్లో ‘ఇందిరమ్మ టవర్స్’ ఇళ్లను ఉచితంగా నిర్మిస్తున్నామని చెప్పారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామం, మండల స్థాయిలో పార్టీ శ్రేణులు టీమ్లుగా ఏర్పడాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరితో ఓటు నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా నుంచి నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.
Also Read : ఓటు హక్కు తొలగింపు రాజ్యాంగ విరుద్ధం: జస్టిస్ ఉజ్జల్
Follow Us On: Youtube

