కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు (Red Cross Elections) ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గతంలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి, సుమారు 4,000 మంది ఓటర్లతో ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేశామని తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం జెడ్పీ సీఈఓను ఎన్నికల అధికారిగా, ఏసీ ఎన్జీవోను అబ్జర్వర్‌గా నియమించామని తెలిపారు.
మొత్తం 15 పోస్టుల కోసం 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగిందని కలెక్టర్ (Collector Rajarshi Shah) తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద 10 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. తాము సైతం స్వయంగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు.
ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ పూర్తి రూపం దాల్చడం ద్వారా ఇకపై జిల్లాలో రక్తదాన శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాలపై విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గం సుగమమవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జెడ్పీ సీఈవో రవి, మెప్మా పీడీ రాజు, అభ్యర్థులు, సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

