కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు , కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలోని బుర్రిపాలెంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 3 లక్షల గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం, CSIR, CBRI , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో రూ.14 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే దేశంలోనే తొలి 3డీ కాంక్రీట్ (3D Houses) ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టుకు కూడా నాయకులు భూమిపూజ చేశారు.
ఈ వినూత్న ప్రాజెక్టు కింద బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలో తొలి విడతగా 175కి పైగా అత్యాధునిక 3డీ ఇళ్లను కూటమి ప్రభుత్వం నిర్మించనుంది. సంప్రదాయ పద్ధతుల కంటే 50-70 శాతం వేగంగా, నిర్మాణ వ్యర్థాలు, శ్రమను గణనీయంగా తగ్గించి, సుదీర్ఘకాలం మన్నికగా ఉండేలా అత్యాధునిక 3డీ ఇళ్లను నిర్మించనున్నారు. పేదల సొంతింటి కలను వేగవంతంగా, అత్యుత్తమ ప్రమాణాలతో సాకారం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కూటమి నాయకులు పేర్కొన్నారు.

