కలం, ఖమ్మం బ్యూరో : ఏళ్ల తరబడి ఎదురుచూసిన తర్వాత ఆ ఇంట్లో పసిబిడ్డ అడుగుపెట్టినా, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సంతానం కోసం రూ.13 లక్షలు ఖర్చు చేసి, పలు వైద్య చికిత్సలు చేయించుకున్న మహిళ ప్రసవానంతరం మృతి చెందడం ఖమ్మంలో (Khammam) తీవ్ర కలకలం రేపుతోంది.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంబల్ గ్రామానికి చెందిన గౌడి లక్ష్మి (36) వివాహమై ఏళ్లు గడిచినా పిల్లలు కలగకపోవడంతో సోషల్ మీడియా ప్రచారం ద్వారా ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. సంతాన సాఫల్య చికిత్సల కోసం రూ.10 లక్షలు, ప్రసవం కోసం మరో రూ.3 లక్షలు వెచ్చించారు. అయితే ప్రసవానంతరం ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడం, రెండు రోజుల్లో దాదాపు 20 ప్యాకెట్ల రక్తం ఎక్కించినా పరిస్థితి విషమించడంతో ఆందోళన వ్యక్తమైంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రికి తరలిస్తామని కోరినా యాజమాన్యం సహకరించలేదని, చివరికి ప్రాణాలు కాపాడేందుకు గర్భసంచి తొలగించినా లక్ష్మి కన్నుమూసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యమే లక్ష్మి మృతికి కారణమని ఆరోపిస్తూ బాధ్యులైన డాక్టర్ రోహిత్, డాక్టర్ విజయ, డాక్టర్ శృతిలపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆసుపత్రి కేస్షీట్, బ్లడ్ బ్యాంక్ రికార్డులను పరిశీలిస్తూ విచారణ జరుపుతున్నారు.

