కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) లో భారత్ తన టార్గెట్‌ను రీచ్ కాలేకపోయింది. ఈ క్రీడల్లో 107+ మెడల్స్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ చివరకు 85 పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెడల్స్ టేబుల్‌లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నా.. అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయామన్న బాధ కాస్తంత మిగిలిపోయింది. అన్ని గేమ్స్‌లో రాణించినప్పటికీ భారత్ ఈ లక్ష్యాన్ని మాత్రం అందుకోలేక పోయింది. కనీసం దగ్గరకు కూడా రాలేకపోయింది. 21 పసిడి పతకాలు వచ్చినా అనుకున్న టార్గెట్‌కు మాత్రం అన్ని పతకాల సంఖ్యలో 22 పతకాలు వెనకబడే ఉంది.
దీంతో ఒకవైపు పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచినా.. అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదన్న బాధ మాత్రం కొంత మిగిలిపోయింది. అయితే ఆఖరి రోజు కూడా భారత్ అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. చివరి రోజే ఐదు పసిడి పతకాలను ఖాతాలో వేసుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో ఇండియా సాధించిన మొత్తం స్వర్ణాల సంఖ్య 21కి చేరుకుంది. అంతేకాకుండా 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలను భారత్ సాధించింది.
చివరి రోజు స్వర్ణాల హోరు
చివరి రోజును భారత్ పసిడితో ప్రారంభించింది. క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి గోల్డ్ మెడల్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌ను 192 పరుగులకే కట్టడి చేసి 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ వర్మ 61 పరుగులతో అదరగొడితే.. పాక్ బ్యాటర్లలో హసన్ నవాజ్ 96 పరుగులు చేసి మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్‌టన్ సుందర్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
గోల్ఫ్‌లో తొలి గోల్డ్
దీంతో పాటు గోల్ఫ్‌లో కూడా భారత్ స్వర్ణం సాధించింది. భారత గోల్ఫర్ ప్రణవి అర్స్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే విభాగంలో స్వర్ణ పతకం సాధించి గోల్ఫ్‌లో భారత్‌కు మొదటి గోల్డ్ మెడల్ అందించారు. ఈ చారిత్రక విజయంతో పాటు అదితి అశోక్, దీక్షా దాగర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకాన్ని కూడా కైవసం చేసుకుంది. ఐచి-నాగోయా వేదికగా జరిగిన ఈ పోటీల్లో ప్రణవి అర్స్ డబుల్ మెడల్స్ గెలుచుకుని భారత క్రీడా చరిత్రలో నిలిచారు.
రెజ్లింగ్‌లో అమాన్ అదరహో
పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్ పసిడి పతకాన్ని ముద్దాడింది. శనివారం నాగోయాలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత రెజ్లర్ అమాన్ షెహ్రావత్ అద్భుత విజయాన్ని సాధించారు. ఉత్తర కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ హన్ చోంగ్ సాంగ్‌ను 11-7 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. శుక్రవారం 65 కేజీల విభాగంలో సుజీత్ కల్కల్ పసిడి నెగ్గగా, ఈ ఆసియా గేమ్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత్‌కు లభించిన రెండో స్వర్ణం ఇది.
హాకీతో చారిత్రక ముగింపు
పురుషుల హాకీ ఫైనల్లో మలేసియాపై భారత్ 5-1తో ఘన విజయం సాధించింది. దీంతో పురుషుల జట్టు వరుసగా రెండో ఆసియా క్రీడలులో స్వర్ణం నిలబెట్టుకుంది. మహిళల జట్టు కూడా గోల్డ్ గెలవడంతో ఒకే ఆసియా క్రీడలులో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు రెండూ ఛాంపియన్లుగా నిలిచాయి. ఈ రెండు స్వర్ణాలతో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది.
కుమ్మేసిన కుంకుమ్
చివరి రోజు భారత ఆర్చర్ కుంకుమ్ మొహోద్ స్వర్ణం గెలిచింది. మహిళల వ్యక్తిగత రీకర్వ్ పోటీల్లో 17 ఏళ్ల కుంకుమ్.. చారిత్రక విజయం సాధించి పసిడి పతకాన్ని ముద్దాడారు. అంతేకాకుండా ఆసియా క్రీడల రీకర్వ్ ఆర్చరీ వ్యక్తిగత పోటీల్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా కుంకుమ్ నిలిచింది.
ఆసియా క్రీడల్లో భారత మెడల్స్ ట్యాలీ ఇలా
ఆర్చరీ
ఆర్చరీలో భారత్‌కు పలు పతకాలు వచ్చాయి. మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్, పురుషుల కాంపౌండ్ టీమ్, మహిళల రికర్వ్ టీమ్ స్వర్ణాలు సాధించాయి. కుంకుమ్ మోహోద్ వ్యక్తిగత రికర్వ్‌లోనూ గోల్డ్ గెలిచారు. రికర్వ్‌లో రెండు రజతాలు, రెండు కాంస్యాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి.
షూటింగ్
షూటింగ్‌లోనూ భారత్ సత్తా చాటింది. కమల్‌జీత్-సురుచి సింగ్ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో స్వర్ణం గెలిచింది. నీరు ధాండా మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ సాధించారు. నీరు ధాండా-కైనన్ చెనై జోడీ మిక్స్‌డ్ ట్రాప్‌లోనూ స్వర్ణం అందుకుంది. ఎయిర్ రైఫిల్, రైఫిల్ 3 పొజిషన్స్, ట్రాప్, పిస్టల్ విభాగాల్లో భారత్‌కు రజతాలు, స్కీట్ విభాగాల్లో కాంస్యాలు వచ్చాయి.
అథ్లెటిక్స్
అథ్లెటిక్స్‌లో భారత్ పలు విభాగాల్లో పతకాలు సాధించింది. మహిళల 4×400 మీటర్ల రిలే రేస్‌లోనూ స్వర్ణం అందుకుంది. గుల్వీర్ సింగ్, సావన్ బర్వాల్, తజీందర్‌పాల్ సింగ్ తూర్, అంసీ సోజన్, సర్వేశ్ కుషారే, మురళీ శ్రీశంకర్, యశ్‌వీర్ సింగ్ రజతాలు గెలిచారు. 10 వేల మీటర్లు, షాట్‌పుట్, పోల్‌వాల్ట్, 400 మీటర్లు, 200 మీటర్లు, డెకాథ్లాన్, స్టీపుల్‌చేజ్, హర్డిల్స్, జావెలిన్, రిలేల్లోనూ కాంస్యాలు వచ్చాయి.
బాక్సింగ్, రెజ్లింగ్
బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహైన్, పర్వీన్ హుడా, అంకుష్ పంఘల్ స్వర్ణాలు గెలిచారు. నరేందర్ బెర్వాల్, ప్రియా ఘాంగాస్, కపిల్ పోఖరియా కాంస్యాలు సాధించారు. రెజ్లింగ్‌లో సుజీత్, అమన్ సెహ్రావత్ గోల్డ్ కొట్టారు. అంతిమ్ పంఘల్, నితేశ్ శివాచ్ రజతాలు గెలిచారు. సునీల్ కుమార్, దీపక్ పునియా కాంస్యాలు సాధించారు.
క్రికెట్, కబడ్డీ
క్రికెట్‌లో మహిళల, పురుషుల జట్లు స్వర్ణాలు సాధించాయి. కబడ్డీలోనూ మహిళల, పురుషుల జట్లు గోల్డ్ గెలిచాయి. హాకీలో కూడా మహిళల, పురుషుల జట్లు స్వర్ణాలు సాధించాయి. దీంతో ఈ మూడు టీమ్ స్పోర్ట్స్‌లో భారత్‌కు డబుల్ గోల్డ్ దక్కింది.
స్క్వాష్, గోల్ఫ్, ఇతర క్రీడల్లోనూ
స్క్వాష్‌లో అభయ్ సింగ్, అనాహత్ సింగ్ వ్యక్తిగత రజతాలు సాధించారు. మహిళల, పురుషుల టీమ్‌లు కాంస్యాలు గెలిచాయి. మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు కాంస్యం వచ్చింది.
వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం సాధించారు. వుషూలో రోషిబినా దేవి రజతం గెలిచారు. బ్యాడ్మింటన్ పురుషుల టీమ్, టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్, రోయింగ్, సెయిలింగ్, సెపక్‌టక్రా, కురాష్, సాఫ్ట్ టెన్నిస్, ఎంఎంఏలోనూ భారత్ పతకాలు సాధించింది.
85 పతకాలతో నాలుగో స్థానం
చివరికి భారత్ ఖాతాలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు చేరాయి. మొత్తం 85 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్థాన్ కూడా 21 స్వర్ణాలు సాధించింది. కానీ భారత్‌కు 27 రజతాలు ఉండటంతో నాలుగో స్థానం దక్కింది.

