కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు తథ్యమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay) స్పష్టం చేశారు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ యువత అంతా బీజేపీ పక్షానే ఉందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. ఎన్నికలపై గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశామని.. ప్రజల్లో బీజేపీకి సానుకూలత ఉందని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని బండి సంజయ్ దుయ్యబట్టారు. అందుకే బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ జరిపి చర్యలు తీసుకోదని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ పోరాడదని చెప్పారు. కాంగ్రెస్ కు నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ఉద్యమాలు ఎందుకు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని సీబీఐకి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయలేదు? అని అడిగారు. ఫ్లై దుబాయ్ విమానంలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ను అభినందిస్తే.. ఆ ఓట్లు ఎక్కడ పోతాయోననే భయంతోనే రాహుల్ గాంధీ స్పందించడం లేదని దుయ్యబట్టారు.

