కలం, సినిమా: దేవర చిత్రంలోని ‘చుట్టమల్లే’ (Chuttamalle) పాటను ఏఐ ద్వారా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఎడిటింగ్లు అత్యంత సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దుశ్చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. మానవత్వాన్ని దెబ్బతీసే ఈ వ్యవహారంపై అందరూ గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ తరహా మార్ఫింగ్ వీడియోలను ఎవరూ చూడటం, డౌన్లోడ్ చేయడం, లేదా షేర్ చేయడం చేయకూడదని చిరంజీవి స్పష్టం చేశారు. వాటిని ఖండించే ఉద్దేశంతో కూడా సర్క్యులేట్ చేయవద్దని కోరారు. బదులుగా సంబంధిత సోషల్ మీడియా వేదికలకు, సైబర్ క్రైమ్ అధికారులకు వెంటనే రిపోర్ట్ చేయాలని కోరారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారితో పాటు, వాటిని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసేవారిని కూడా చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమస్యను కేవలం ఒక వ్యక్తికి లేదా సినిమాకు సంబంధించినదిగా చూడకూడదని చిరంజీవి అన్నారు. ఇది రేపు ఎవరికైనా ఇది జరగవచ్చని ఆయన హెచ్చరించారు. బాధితులకు అండగా నిలిచేందుకు, చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఇతర అనుబంధ సంఘాలతో కలిసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టులో చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, అమిత్ షా, కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్‌లను ట్యాగ్ చేశారు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఈ వీడియోకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

