కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (Bhadradri Thermal Power Station)లో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్లాంట్‌లోని మూడో యూనిట్ రోటర్ ఎగ్జైటర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గడచిన 24 రోజులుగా ఈ సమస్య కొనసాగుతుండటంతో ప్రాజెక్టు పరిధిలో గణనీయంగా ఉత్పత్తి పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ సాంకేతిక అంతరాయం కారణంగా రోజూ 270 మెగావాట్ల చొప్పున ఇప్పటివరకు సుమారు 15.55 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్లాంట్ కోల్పోయింది.
ఢిల్లీకి పంపించిన అధికారులు..
రోటర్ ఎగ్జైటర్ పరికరానికి మరమ్మతులు నిర్వహించేందుకు అధికారులు వాటిని ఢిల్లీకి పంపించారు. తిరిగి రావడానికి మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్లాంట్ ప్రతినిధులు శనివారం వెల్లడించారు. ప్రస్తుతం మూడో యూనిట్ ఆగిపోయినా.. మిగిలిన మూడు యూనిట్లు యథావిధిగా పనిచేస్తున్నాయి. వీటి ద్వారా రోజూ 810 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ గ్రిడ్‌కు సరఫరా చేస్తున్నారు. నిలిచిపోయిన యూనిట్‌కు త్వరలోనే మరమ్మతులు పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

