కలం, స్పోర్ట్స్: ఆసియా గేమ్స్ పురుషుల క్రికెట్ (Asian Games Cricket) ఫైనల్స్‌లో భారత్ విజయం సాధించడమే కాకుండా, ఈసారి ఎలాంటి వివాదాలు లేకుండా పతక ప్రధానోత్సవం ప్రశాంతంగా ముగిసింది. శనివారం జపాన్ వేదికగా జరిగిన తుది పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో దిగిన భారత్ 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. గతంలో ఆసియా కప్ విజయం తర్వాత ట్రోఫీ స్వీకరణపై చోటుచేసుకున్న డ్రామాకు ఈసారి చోటులేకుండా పోయింది.
పీసీబీ ఛైర్మన్, ఏసీసీ ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దాంతో, ఐసీసీ ఛైర్మన్ జై షా చేతుల మీదుగా భారత ఆటగాళ్లు ఎలాంటి అభ్యంతరం లేకుండా స్వర్ణ పతకాలను అందుకున్నారు. పాకిస్థాన్‌కు ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధి వెండి పతకాన్ని అందజేశారు. మ్యాచ్ విషయానికొస్తే, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 211/6 భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ 61 పరుగులు చేయగా, తిలక్ వర్మ అజేయంగా 51 పరుగులు జోడించాడు.
ఛేదనలో పాకిస్థాన్ 192/6 పరుగులకే పరిమితమైంది. గ్రౌండ్‌లో ఎలాంటి కరచాలనాలు లేనప్పటికీ, ఆటగాళ్లు పూర్తి క్రీడాస్ఫూర్తితో గేమ్‌పైనే దృష్టి పెట్టారు. ఏడాది కాలంగా మెడల్స్, ట్రోఫీల చుట్టూ నడిచిన అనిశ్చితికి తెరపడటంతో భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో ఆధిపత్యం ప్రదర్శించడమే కాకుండా, పసిడి పతకాన్ని చేతుల్లోకి తీసుకుని టీమిండియా ఈ ఆసియా గేమ్స్ ప్రచారాన్ని ఘనంగా ముగించింది.

