నిర్మల్‌లో ఎస్ఐఆర్‌పై ఎన్నికల పరిశీలకుల సమీక్ష

కలం, నిర్మల్ : అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను (SIR Process) పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి (TK Sreedevi) అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టి.కె. శ్రీదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటు హక్కు పునాది వంటిదని అన్నారు. ఓటు హక్కు దుర్వినియోగాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో, అర్హులైన ఒక్క ఓటరూ తమ హక్కును కోల్పోకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.

జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్, అధికారులు, సహకరిస్తున్న రాజకీయ పార్టీల ప్రతినిధులను అభినందించారు. మిగిలి ఉన్న ధ్రువపత్రాల పరిశీలనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. బీఎల్‌ఓలు తప్పనిసరిగా ఓటర్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లకు సంబంధించిన కారణాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రికార్డులను పక్కాగా నిర్వహించాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై స్వీప్ కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి, కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి నిర్మల్ పట్టణంలోని కస్బా, నిర్మల్ రూరల్ మండలంలోని న్యూ పోచంపాడ్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై స్థానిక బీఎల్‌ఓలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, భైంసా, ఉట్నూర్ సబ్ కలెక్టర్లు అజ్మీరా సంకేత్ కుమార్, ప్రణయ్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>